కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు
కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు
ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన భారతదేశానికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆర్. ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞానందకు మోదీ అభినందనలు తెలిపారు. "యువ మేధావి ఆర్ ప్రజ్ఞానంద విజయం పట్ల సంతోషిస్తున్నాను. ప్రముఖ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు గర్విస్తున్నాను. ప్రతిభావంతుడైన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. కాగా ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలోనే ఐదవ అతిపిన్న వయస్కుడైన 16 ఏళ్ల ప్రజ్ఞానానంద ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ చెస్ నంబర్ వన్ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచాడు.
అయితే వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌ను ఓడించినప్పటికీ ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ఈ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ను 11వ స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో నాకౌట్‌కు అర్హత సాధించాలంటే తొలి ఎనిమిది స్థానాల్లో నిలవాలి. కానీ ప్రజ్ఞానంద 11వ స్థానంలో నిలిచి నాకౌట్ చేరే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే కార్ల్‌సన్‌ను ఓడించిన అనంతరం ప్రజ్ఞానంద మరో రెండు రౌండ్లలో విజయం సాధించాడు. రష్యా ఆటగాడు నాడిర్‌బెక్ అబ్దుసట్టారావ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగా.. 10, 12 రౌండ్లలో అండ్రీ ఎసిపెంకో, అలెగ్జాండ్రా కోస్టిన్యూక్‌లను ఓడించాడు. కానీ దురదృష్టవశాత్తూ నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు.
అంతకుముందు కార్ల్‌సన్‌పై సాధించిన విజయం పట్ల ప్రజ్ఞానంద స్పందించాడు. వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్‌ని ఓడించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. కార్ల్‌సన్‌తో ఆడిన మ్యాచ్‌లో తాను ప్రత్యేకంగా వ్యూహాలేమీ అమలు చేయలేదని ఈ 16 ఏళ్ల కుర్రాడు చెప్పాడు. కార్ల్‌సన్‌తో ఆడుతున్నంత సేపూ ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా ఆటను ఎంజాయ్ చేశానని వివరించాడు. అలాగే ఈ విజయం తనలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో రాణిస్తానని ప్రజ్ఞానానంద అన్నాడు.
Comments