ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం | Tri ratra vratham starts

ఈ రోజు నుండి దేవి 'త్రిరాత్ర' వ్రతం ప్రారంభం



వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం

నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


జగజ్జనని అయిన అమ్మవారి దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని, అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని దేవీభాగవతం చెబుతోంది.


ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు. ఈ తల్లి శక్తి అనంతం, అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లి తొమ్మిదిరకాలుగా అర్చించి పూజిస్తారు.


మూడు కన్నులతో, పదహారు చేతులతో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. పాముల కంకణాలతో, నల్లని కంఠంతో, నల్లని వర్ణంతో కనిపించే తల్లిని షోడశ భుజ దుర్గాదేవిగా, ఎనిమిది చేతులతో మహిషి (ఎద్దు) తలమీద ఎక్కి బంగారు వర్ణంతో కనిపించే అమ్మను వనదుర్గాదేవిగా, రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణంతో సర్వభూషణ శోభితంగా దర్శనం ఇచ్చే తల్లినిరుద్రాంశ దుర్గాదేవిగాను, వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కి శూలినీ దుర్గాదేవి స్వరూపంగా, అష్ట్భుజాలతో, చంద్రరేఖను ధరించిన శిరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపంగా, సింహ వాహనంతో జయదుర్గాదేవిగా, మెరుపు తీగ లాంటి బంగారు వర్ణ శరీర కాంతితో, బంగారు పద్మం మీద ఆశీనురాలై, ఇంద్రాది దేవతలందరిచేత స్తుతించబడే వింధ్యావాసిని దుర్గాదేవి స్వరూపంగా ఎర్రని శరీర వర్ణంతో కుడి చేత తర్జనీముద్రని, ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపంతో రిపుమారిణి దుర్గాదేవి స్వరూపంగా, తెల్లని శరీర వర్ణంతో, మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తుంది.


కుడివైపు చేతుల్లో అభయముద్ర చక్రాలను ఎడమవైపు నడుంమీద ఒకచేతిని, మరో చేత శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగా జగన్మాతను కొలుస్తారు. ఇలా శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయి. ఇలా తొమ్మిదిరోజుల వ్రతం పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని త్రిరాత్ర వ్రతదీక్ష అని పిలుస్తారు. ఇంకొందరు అమ్మ వ్రతంలో భాగంగా బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్ని పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్ళు, ముతైదువులకు పసుపుకుంకుమలతో పండు తాంబూలాలు పంచు కొంటారు. నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనులపండువను, భక్తులను ఆనందపరవశులను చేస్తాయి.


అష్టమి అంటే దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి. అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు. ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో, కుంకుమార్చనలతోనూ అర్చిస్తే, సత్ సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవు. నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని సిద్దిదా అని పిలుస్తారు. నవమి రోజున మహార్నవమి అంటూ పూజ చేస్తారు. పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు, చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు. అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది. కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం కాగలదు.


దశమి రోజున శమీ పూజ చేస్తారు. దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. శమిఅంటే జమ్మి చెట్టు.  ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు. పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట. తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడ లేకుండా చేస్తుంది.

Comments