లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది...!


లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది...!

హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌కు ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలుగా ఈ మధ్యనే అటల్‌ టన్నెల్‌ పూర్తయింది. రెండు ప్రాంతాల ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. అయితే ఇప్పుడు అలాంటి మరో టన్నెల్‌నే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిపేరే జోజిలా పాస్‌ టన్నెల్‌. శ్రనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు ఈ సొరంగం నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణం కోసం కూడా ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అనేక కారణాలతో దీని నిర్మాణం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు గురువారం ఈ టన్నెల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

 

జోజిలా పాస్‌ టన్నెల్‌ ద్వారా శ్రీనగర్‌-లద్దాఖ్‌ల మధ్య సంవత్సరం పొడవునా వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యాపార లావాదేవీలు జరిపేందుకు, కూలి పనులు చేసుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అటల్‌ టన్నెల్‌ నిర్మాణం తరువాత కేంద్రం జోజిలా టన్నెల్‌పై దృష్టి సారించింది. రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ టన్నెల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా మొదటి బ్లాస్టింగ్‌ చేసి పనులను ప్రారంభించారు.

 

జోజిలా పాస్‌ దాదాపు 14.15 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ టన్నెల్‌కు ఆసియాలోనే పొడవైన సొరంగాలలో ఒకటిగా పేరుంది. దీని ద్వారా శ్రీనగర్‌ నుంచి కార్గిల్‌, ద్రాస్‌ గుండా లద్దాఖ్‌ లోని లేహ్‌ వరకు సులభంగా చేరుకోనే సౌలభ్యం ఏర్పడుతుంది. సాధారణంగా ఏడాదిలో 6 నెలలు మాత్రమే ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగుతాయి. మిగతా 6 నెలలు విపరీతంగా మంచు కురవడం వల్ల మార్గం మొత్తం కప్పబడిపోయి ఉంటుంది. దీనివల్ల లద్దాఖ్‌తో పాటు కార్గిల్‌ తదితర ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి.

 

లద్దాఖ్‌కు చెందిన అనేకమంది శ్రీనగర్‌లో రోజుకూలి పనులు చేసుకుని జీవనం సాగించే లద్దాఖీలు పని లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీనగర్‌ ప్రాంతంలోని వ్యాపారులు కూడా లద్దాఖ్‌కు వెళ్లి వ్యాపారం చేసుకోలేక అవస్థలు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జోజిలా పాస్‌ టన్నెల్‌ నిర్మాణానికి కేంద్రం సిద్ధమవడంతో ఇరు ప్రాంతాల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.

 

జోజిలా పాస్‌ టన్నెల్‌ సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉంటుంది. శ్రీనగర్‌-కార్గిల్‌-లేహ్‌ నేషనల్‌ హైవేను కలుపుతూ ఈ జోజిలా పాస్ ఉంటుంది. అయితే ఈ మార్గం చలికాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఇటుగా ఏ వాహనం వెళ్లడానికి అసాధ్యంగా ఉంటుంది. ఆ పరిస్థితిని అధిగమించేందుకే 14.15 కిలోమీటర్ల పొడవుతో జోజిలా పాస్‌కు 3వేల మీటర్ల కిందుగా జోజిలా పాస్‌ టన్నెల్‌ నిర్మాణం జరగనుంది.

 

జోజిలా పాస్‌ టన్నెల్‌ నిర్మాణం కోసం 2018లో ప్రధాని నరేంద్ర మోదీ 2018లో పునాది రాయి వేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.6,800 కోట్ల బడ్జెట్‌ను సైతం కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల గతేడాది ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. దీంతో టన్నెల్‌ నిర్మాణం నిలిచిపోయింది. ఏడాది తరువాత కేంద్ర ట్రాన్స్‌పోర్ట్‌ మంత్రి గడ్కరీ ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రాజెక్టు నాణ్యత తగ్గకుండా, ఖర్చు తగ్గించేందుకు ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం ఖర్చు తగ్గించేందుకు టన్నెల్‌ నిర్మాణంలో కొన్ని కీలక మార్పులు కూడా చేశారు.

 

ప్రాజెక్టు నిర్మాణంలో కీలక మార్పులు చేసిన తరువాత కేంద్ర మంత్రిత్వశాఖ మళ్లీ టెండర్లు పిలిచింది. అందులో మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.. మెయిల్‌ అతి తక్కువగా రూ.4509.5 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం మెయిల్‌కు అప్పగించింది. మార్పులు చేసిన ప్రాజెక్టు కారణంగా టన్నెల్‌ నిర్మాణంలో దాదాపు రూ.4వేల కోట్ల వరకు ప్రభుత్వంపై భారం తగ్గుతుందని, అయితే నాణ్యత, రక్షణ విషయాల్లో మాత్రం వెనక్కి తగ్గలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!