గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో…!

 గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో…!

 


కరోనా ఉద్యోగాన్ని కాటేసింది. దీంతో లక్షల రూపాయల ఉద్యోగాన్ని కోల్పోయాడు ఆ యువకుడు. కానీ అత్మవిశ్వాశాన్ని కోల్పోలేదు. ఉద్యోగం పోయిందనే నిరాశతో ఇంట్లో కూర్చోలేదు. తన ఆలోచనలకు పదునుపెట్టాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరీ చాయ్‌ను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చాయ్‌కి యమగిరాకీ పెరిగింది. అలాంటి అద్భుతమైన తందూరి చాయ్ తాగడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. అందరినీ ఆకట్టుకుంటున్న తందూరి చాయ్‌పై స్పెషల్ స్టోరీ.

 

నిర్మల్ జిల్లా చించోలిబి గ్రామానికి చెందిన కోంతం గంగాధర్. అందరిలానే కరోనా దెబ్బకు నష్టపోయిన వారిలో ఇతను ఒకడు. కరోనా రాకముందే దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే అంతకు మించి ప్రసిద్ధి చెందిన ఇటలీలోని ఓ హోటల్‌లో ఉద్యోగానికి గంగాధర్ సెలక్ట్‌ అయ్యాడు. నెలకు రెండు లక్షల జీతం. దీంతో ఇటలీ వెళ్దామని భావించి దుబాయిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి చేరాడు. అయితే ఇంటికి రాగానే కరోనా విజృంభించింది. పైగా ఇటలీలో ఈ మహమ్మారి వేల మందిని బలి తీసుకుంది. ఇటలీకి ఎవరూ రాకూడదని ఆ దేశం ఎమ్మిగ్రేషన్‌ను రద్దు చేసింది. దీంతో ఉన్న ఉద్యోగం కోల్పోయి, లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు గంగాధర్.

 

ఉద్యోగం పోయినా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు గంగాధర్. క్లిష్ట పరిస్థితుల్లోనూ తన బుర్రకు పదునుపెట్టాడు. ఓ ఆలోచనతో ముందుకు సాగాడు. అందరికంటే భిన్నంగా ఆలోచించి తందూరి చాయ్‌ పేరుతో ఓ హోటల్‌ను ప్రారంభించాడు గంగాధర్. గంగాధర్‌ ప్రారంభించిన హోటల్‌లో తయారు చేసే తందూరు చాయ్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఈ చాయ్‌ని కుండలో సహజ సిద్దంగా తయారు చేస్తారు. కుండలో చాయ్‌ను తయారుచేయడం చాయ్‌ను చిన్న సైజ్‌ కుండలో ఇవ్వడంతో అద్భుతమైన రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. సరికొత్త చాయ్‌ను తాగడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు.

 

గ్రీన్, అల్లం టీ మాటలు విన్న ప్రజలు కొత్తగా తందూరు చాయ్ తయారుకావడంతో ఆ చాయ్‌ను తాగడానికి మక్కువ చూపుతున్నారు. సాధారణంగా చాయ్‌కి ఐదు రుపాయలు ధర ఉంటుంది. కానీ ఈ చాయ్‌కి పది రూపాయల ధర నిర్ణయించాడు నిర్వాహకుడు గంగాధర్. రోజుకు 60 లీటర్ల పాలు అమ్ముడుపోతున్నాయని గంగాధర్ చెబుతున్నారు. ఈ తందూరి చాయ్‌ ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా కరోనాను దూరంగా ఉంచుతుందని చాయ్‌ ప్రియులు వెల్లడించారు. అన్ని చాయ్‌ల కంటే ఈ తందూరి చాయ్‌ భిన్నంగా ఉందని రుచి కూడా బావుందంటున్నారు కొనుగోలుదారులు. ఇప్పుడు ఈ తందూరి చాయ్‌కు అక్కడ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ కొత్తరకం చాయ్‌ను తాగడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఆ చాయ్‌ ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు చాయ్‌ తాగినవారు.

 

Comments