వైసీపీలోకి నాదెండ్ల మనోహర్...!

 


ఇప్పటికే వరుస వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపి పవన్ తో పొత్తు తెగ తెంపులు చేసుకోకపోయినా, చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఏ విషయంలోనూ కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ ఒంటరిగా ముందుకు వెళ్ళలేక , ఇష్టం లేకపోయినా బీజేపి తోనే ముందుకు అడుగులు వేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా, జనసేన పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.

 

గత కొంతకాలంగా ఆయన జనసేన పార్టీలో ఇమడలేక పోతున్నారని, తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైసీపీతో అడుగులు వేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయంతో, ఆ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీలో ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటూ వస్తోంది. పవన్ ఏ పర్యటనకు వెళ్లినా, పక్కన నాదెండ్ల ఉంటారు. పవన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, దాంట్లో ఆయన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. అంతగా ఆయనకు ఆ పార్టీలో ప్రాధాన్యం ఉంటూ వస్తున్న భవిష్యత్ పై బెంగతో, వైసీపీ వైపు వచ్చేందుకు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీలో చేరే విషయం ఇప్పటికే తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో నాదెండ్ల మనోహర్ చర్చలు జరిపారని, అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తోనూ ఇదే విషయమై చర్చించినట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

ఇక జగన్ సైతం ఆయన తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు గాను ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయం ఇప్పటికీ బయటకు రాలేదు. కేవలం అంతర్గతంగా మాత్రమే చర్చలు జరుగుతున్నాయట. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే పవన్ రాజకీయంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

 

Comments