గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త 'హోల్డ్ ఫర్ మీ’

 గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త 'హోల్డ్ ఫర్ మీ

 


సాంకేతికత ఇంతలా అభివృద్ధి చెందని కొత్తలో, మనకు ఎలాంటి సాయం కావాలన్నా సంస్థల టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసేవాళ్లం. మనకు అవసరమైన సమాచారాన్ని ఆయా సంస్థల కస్టమర్ ఏజెంట్లు అందించే వరకు మన కాల్‌ను చాలా సేపు హోల్డ్‌లో పెట్టేవారు. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీల కస్టమర్ కేర్ సెంటర్లకు కాల్ చేస్తే గంటల కొద్దీ కాల్ హోల్డ్‌లో పెట్టేవారు. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు లేకుండా గూగుల్ కొత్త కాల్ అప్‌డేట్‌ను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ కాల్స్‌ను గూగుల్ సాయంలో మనం కూడా హోల్డ్‌లో పెట్టొచ్చు.
గూగుల్ భవిష్యత్తులో విడుదల చేసే మోడళ్లలో ఈ సరికొత్త 'హోల్డ్ ఫర్ మీ' ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. కస్టమర్ సపోర్ట్ ప్రతినిధి స్పందన కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, వినియోగదారుల సమయం వృథా కాకుండా గూగుల్‌ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. అమెరికాలో గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 5, పిక్సెల్ 45జి స్మార్ట్‌ఫోన్‌ల కోసం 'హోల్డ్ ఫర్ మీ' ప్రివ్యూ ఫీచర్‌ను ప్రకటించింది. దీని పనితీరు గురించి బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. సాధారణంగా వినియోగదారుడు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసినప్పుడు.. మరిన్ని సేవలందించేందుకు కస్టమర్ సర్వీస్ ఏజెంట్ మన కాల్‌ను హోల్డ్‌లో పెడతాడు. ఇలాంటి సందర్భంలోనే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

హోల్డ్ ఫర్ మీ ఫీచర్‌ను ఎంపిక చేసుకుంటే గూగుల్ అసిస్టెంట్ కస్టమర్ ఏజెంట్‌ కాల్‌ను పర్యవేక్షిస్తుంది. ఒకవేళ కాల్‌ను ఏజెంట్ హోల్డ్‌లో పెడితే... ఆ సమయంలో వినియోగదారుడు తన పని తాను చేసుకోవచ్చు. ఏజెంట్ మళ్లీ వినియోగదారుడికి కాల్‌ కనెక్ట్ చేసినప్పుడు.. సౌండ్‌, వైబ్రేషన్‌తో స్క్రీన్‌పై నోటిఫికేషన్ ఇచ్చి గూగుల్‌ అలర్ట్ చేస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఒకవేళ వినియోగదారుడు ఏజెంట్‌తో తిరిగి కాల్ మాట్లాడేందుకు కాస్త సమయం పడితే, అప్పటి వరకు ఏజెంట్‌నే కాసేపు హోల్డ్‌లో ఉండమని గూగుల్‌ తెలియజేస్తుంది.


గూగుల్ తన సొంత డ్యూప్లెక్స్ టెక్నాలజీని ఉపయోగించి కాల్ మానిటరింగ్ చేస్తుంది. మ్యూజిక్‌, రికార్డ్ చేసిన మెస్సేజ్‌, ఒరిజినల్ వాయిస్‌కు ఉన్న తేడాలను ఈ సాంకేతికత గుర్తించగలదు. ఫోన్ స్క్రీన్‌లో రియల్ టైమ్ క్యాప్షన్ల ద్వారా గూగుల్‌ కాల్‌ను పర్యవేక్షిస్తుంది. హోల్డ్ ఫర్ మీ ఫీచర్‌ను ఆప్షనల్‌గా ఇస్తోంది. గూగుల్‌ సెట్టింగ్స్‌లో దీన్ని ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్‌ దాదాపు ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడిని ఆకర్షిస్తుందని గూగుల్ చెబుతోంది.

Comments