అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు



అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు

తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం మంటల బారిన పడిన ఘటన సరికొత్త మలుపు తిరిగింది. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఈ వ్యతిరేకతను చల్లార్చడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఫలించినట్లు కనిపించట్లేదు.

 

ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. అంతర్వేది దేవాస్థానం కార్యనిర్వహణాధికారినీ విధుల నుంచి తప్పించింది. ప్రాధాన్యత లేని విభాగానికి పంపించింది. రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు.

 

దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను పంచాయతీ రాజ్గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌కు అప్పగించారు. అంతర్వేది ఆలయ కార్యనిర్వహణాధికారి చక్రధరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఇన్‌ఛార్జిగా నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

అంతర్వేది దేవస్థానానికి చెందిన రథం దగ్ధం కావడం పట్ల రాజకీయంగా నిరసనలు చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జేఎస్వీ ప్రసాద్‌ను బదిలీ చేయడం కూడా మరో రచ్చకు దారి తీసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇదివరకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని తప్పించినట్టే జేఎస్వీ ప్రసాద్‌ను బదిలీ చేశారని అంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను కూడా అప్పట్లో మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం.

 

ఇదిలావుండగా.. అంతర్వేదిలో చోటు చేసుకున్న ఘటన పట్ల అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపుతోంది. అన్ని రాజకీయ పార్టీలూ ప్రభుత్వంపై దాడికి దిగాయి. తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించింది. తాజాగా- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం దీనిపై స్పందించారు. ఇదివరకు నెల్లూరు జిల్లా బిట్రగుంటలో సంభవించిన ఇదే తరహా అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావించారు.

 

 


Comments