చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

 


సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్, చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం, ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్, టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.

 

భారత్ సేకరించిన క్షిపణుల్లో బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్‌ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్‌. కాగా 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్‌ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్‌ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్‌ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్‌ సిద్ధంగా ఉంచింది.

ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్‌ నికోబార్‌ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్‌ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్‌ వద్ద నిర్భయ్‌ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది.

నిర్భయ్‌ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఆకాశ్‌ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్‌ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్‌ క్షిపణిలోని రాడార్‌ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు.

అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్‌ మిస్సైల్స్, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్‌ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్‌ దగ్గరలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. మరోవైపున త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్‌ఐజీ సావర్‌ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!