వాట్సాప్‌ను వణికిస్తున్న 'టెక్ట్స్‌ బాంబ్స్‌'



  • సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్‌ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్‌ యూజర్స్‌కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్‌కు చెందిన హ్యాకర్స్‌ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్‌ బాంబ్‌గా పిలిచే స్కేరీ మెస్సేజెస్‌ (Scarry Messages) వైరస్‌తో వాట్సాప్‌ నెట్‌వర్క్‌పై దాడి చేసినట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు వెల్లడించింది.

     

    కొద్ది రోజుల కిత్రం వాట్సాప్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యాప్‌లలో ఎలాంటి కొత్త ఫీచర్స్‌ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది. అందులో ఒకరు తనకు టెక్ట్స్‌ బాంబ్‌ సందేశాలు వస్తున్నాయని ట్వీట్ చేశారు. దీనిపై వాబీటాఇన్ఫో స్పందిస్తూ ''కొద్ది వారాల క్రితమే దీని గురించి మేం ప్రస్తావించాం. మా ఫాలోవర్స్‌లో కొంత మంది దీన్ని బినారియో, కాంటాక్ట్ బాంబ్స్‌, ట్రావా జాప్‌, క్రాషర్స్‌, వికార్డ్ క్రాష్‌, టెక్ట్స్‌ బాంబ్'' అని పిలుస్తారని తెలిపింది. దీని గురించి వివరించడం కష్టమని, ఆ సందేశం తెరిచిన ప్రతిసారీ వాట్సాప్‌ క్రాష్‌ అవుతుందని వెల్లడించింది.

     

     

    టెక్ట్స్‌ బాంబ్ అంటే…!


    ఎలాంటి అర్థం లేని కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్‌ను వరుస క్రమంలో ఉంచి ఒక సందేశం లేదా ఏదైనా ఆర్ట్‌ రూపంలో సృష్టించి ఫార్వార్డ్‌ మెస్సేజ్‌లా పంపుతారు. దానిని రిసీవ్ చేసుకున్న వారు తెరవగానే వాట్సాప్‌ క్రాష్ అవుతుంది. కొన్నిసార్లు వాట్సాప్‌ను క్లోజ్‌ చేసి, తిరిగి ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తే ఫోన్‌ క్రాష్ అయ్యే అవకాశమూ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సమస్యకు ఎలాంటి తాత్కాలిక పరిష్కారం లేదని వాబీటాఇన్ఫో తెలిపింది.

     

    ప్రస్తుతానికి వాట్సాప్‌ యూజర్స్‌ తమకు తెలియని నంబర్ల నుంచి ఎలాంటి సందేశాలు వచ్చినా వాటిని ఓపెన్ చేయకపోవడమే మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై వాట్సాప్‌ అధికార ప్రతినిధి ఒక ఆంగ్లమీడియా సంస్థతో మాట్లాడుతూ కొత్త ఐఓఎస్‌ వెర్షన్‌లో ఈ సమస్యను ఎదుర్కొనే విధంగా మార్పులు చేసి తీసుకురానున్నట్లు తెలిపారు. అలానే యూజర్స్‌ తమ వాట్సాప్‌ యాప్, ఫోన్‌ ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.

     

    వాటితో పాటు కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా కూడా ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు మీ అనుమతి లేకుండా గ్రూప్స్‌లో మీ నంబర్‌ యాడ్ చేయకుండా ఉండాలంటే.. వాట్సాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీపై క్లిక్ చేస్తే గ్రూప్‌ అని కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌చేసి అందులో మీ నంబర్‌ గ్రూప్‌లో యాడ్ చేసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వాలనేది ఎంచుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని మీకు తెలియని గ్రూప్‌లో యాడ్ చేయకుండా అడ్డుకోవచ్చు. దాని వల్ల కొంత వరకు టెక్ట్స్‌ బాంబ్ వంటి వైరస్‌ నుంచి మీ ఫోన్‌ను కాపాడుకోవచ్చు.

     


Comments